యువతిపై హత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు.. సాయం చేస్తానని అపరిచితుడు

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది.

By -  అంజి
Published on : 28 Feb 2026 1:30 PM IST

Odisha Rape and Murder, Jagatsinghpur Crime, Women Safety in Odish, Paradip Town Incident

యువతిపై హత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు.. సాయం చేస్తానని అపరిచితుడు

మహిళా భద్రతపై ఎన్ని చట్టాలు వచ్చినా, మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు వేర్వేరు చోట్ల అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, చివరకు ఆమెను భవనం పైనుంచి తోసేసి కిరాతకంగా చంపేశారు.

ఫిబ్రవరి 22న బాధితురాలు తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చింది. గుడిలో పెళ్లి చేసుకుందామని నమ్మించిన ప్రియుడు, ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఒక బస్టాండ్ దగ్గర వదిలేసి పరారయ్యాడు.

బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న సదరు యువతిని చూసి జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి సాయం చేస్తానని నమ్మబలికాడు. ఆమెను పారాదీప్ పట్టణంలోని తను నివసిస్తున్న అద్దె గదికి తీసుకెళ్లి, అక్కడ మళ్ళీ ఆమెపై అత్యాచారం చేశాడు. అఘాయిత్యం తర్వాత సాక్ష్యం దొరకకూడదనే ఉద్దేశంతో, నిందితుడు ఆమెను ఆ నాలుగో అంతస్తు భవనం పైనుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

యువతి కనిపించడం లేదని ఆమె సోదరుడు ఫిబ్రవరి 22నే ఫిర్యాదు చేశారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు తర్వాత దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కిడ్నాప్, అత్యాచారం మరియు హత్య కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆయన ఎక్స్‌ (X) వేదికగా విమర్శించారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.

Next Story