వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో యువతిపై హోంగార్డు అసభ్య ప్రవర్తన, అరెస్ట్
ఓ హోంగార్డు ట్రైన్‌లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు
By Srikanth Gundamalla Published on 30 May 2024 8:15 AM ISTవెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో యువతిపై హోంగార్డు అసభ్య ప్రవర్తన, అరెస్ట్
పోలీసులు ప్రజలకు భద్రతను కల్పించాలి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయపడాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే... పోలీసులు కొందరు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ హోంగార్డు ట్రైన్‌లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది.
ఓ కుటుంబం తిరుపతి వెళ్లింది. దర్శనం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు పయనం అయ్యింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. నైట్ జర్నీ కావడంతో ట్రైన్‌లో ఆ ఫ్యామిలీ నిద్రపోయింది. ఎస్-3 కోచ్‌లో నిద్రిస్తున్న యువతి వద్దకు వెళ్లిన హోంగార్డు ప్రతాప్ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో.. వెంటనే మెల్కొన్న యువతి గట్టిగా అరిచింది. అక్కడే ఉన్న తండ్రిని లేపింది. దాంతో.. హోంగార్డును పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాచిగూడ చేరుకున్న వెంటనే పోలీసులు హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. సదురు హోంగార్డు కోడూరు పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. యూనిఫామ్‌లోనే ఉండి ఈ నీచపు పనికి పాల్పడ్డాడని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు. అంతేకాదు.. అతను టికెట్ లేకుండానే ట్రైన్‌లో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి స్వస్థలం కడప జిల్లా రైల్వే కోడూరు అని పోలీసులు చెప్పారు.
ఈ సంఘటన రైల్వే ప్రయాణికుల్లో అలజడి రేపింది. సాధారణంగానే రైళ్లలో ఎక్కితే ప్రయాణికులు భయపడిపోతుంటారు. దొంగలు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దోచుకుంటారో తెలియదంటుంటారు. ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. అలాంటి ట్రైన్ జర్నీలో యూనిఫాంలో వచ్చి మరీ హోంగార్డు ఇలా చేశాడంటే ఇంకెవరిని నమ్మాలంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.