కౌన్సెలింగ్‌కు పిలిచి.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం
Head constable misbehave with girl in Nellore district.కంచె చేను మేస్తే అన్న చందంలా ప్రస్తుతం పరిస్థితులు
By తోట వంశీ కుమార్ Published on 28 Dec 2021 11:38 AM ISTకంచె చేను మేస్తే అన్న చందంలా ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. రక్షించాల్సిన వారే దారుణాలకు పాల్పడుతున్నారు. నేరాలను అడ్డుకోవాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న పోలీసు ఓ బాలికపై అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. కౌన్సెలింగ్ ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సుధాకర్ అనే వ్యక్తి హెడ్‌కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఓ సమస్య పరిష్కారం కోసం తండ్రి, కూతురు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారు సుధాకర్‌ను సంప్రదించగా.. బాలికకు కౌన్సెలింగ్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని తండ్రికి సూచించాడు. బాలికను తీసుకుని ఇంటికి రావాలని చెప్పాడు. మరుసటి రోజు బాలికను తీసుకుని తండ్రి.. సుధాకర్ ఇంటికి వెళ్లాడు.
తండ్రిని ఓ షాపుకు పంపించిన సుధాకర్.. బాలికపై అత్యాచార యత్నం చేశాడు. విషయాన్ని ఎవ్వరికి చెప్పవద్దు అంటూ బాలికను బెదిరించాడు. దీంతో బాలిక ఆ సమయంలో మౌనంగా ఉండిపోయింది. అనంతరం ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుల్ పై ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.