కూతురిపై ప్రియుడి వేధింపులు, వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 10:32 AM ISTకూతురిపై ప్రియుడి వేధింపులు, వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల శివాని (32) అనే వివాహిత చున్నీతో తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో తాజాగా పోలీసులు జరిపిన విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోన్న శివాని ముస్తఫా అలియాస్ ఖాలీద్‌కు దగ్గరైంది. అతడితో సహజీవనం చేస్తోంది. అయితే.. ప్రియుడు ఖాలీద్ కొంతకాలంగా వివాహిత కుమార్తె (12)తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయం శివానికి తెలియడంతో అతడిని మందలించింది. అయినా.. అతని తీరు మారలేదు. పలుమార్లు ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఎంతకీ ముస్తఫా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆవేదనకు గురైంది వివాహిత శివాని. ప్రియుడు తన కూతురిని లైంగికంగా వేధిస్తుండటంతో జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి తన ఇద్దరు పిల్లలను సోదరి ఇంటికి పంపించింది శివాని. ఇంట్లో పిల్లలెవరు లేకుండా చూసుకుని తన చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ విషయాలు అన్నీ వెలుగులోకి రావడంతో .. ఆదివారం శివాని ప్రియుడు ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా విచారించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామనీ.. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ కుమార్ వెల్లడించారు.