16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య కలకలం.. 'డెడ్‌బాడీ కోసం స్మశానవాటిక చెరువులో వెతకండి' అంటూ..
ఓ 16 ఏళ్ల విద్యార్థిని తీసుకున్న ఆవేదన భరిత నిర్ణయం గురుగ్రామ్‌లో తీవ్ర కలకలం రేపింది. తన ఆచూకీ ఎక్కడ ఉంటుందో ముందే..
By - అంజి |
16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య కలకలం.. 'డెడ్‌బాడీ కోసం స్మశానవాటిక చెరువులో వెతకండి' అంటూ..
ఓ 16 ఏళ్ల విద్యార్థిని తీసుకున్న ఆవేదన భరిత నిర్ణయం గురుగ్రామ్‌లో తీవ్ర కలకలం రేపింది. తన ఆచూకీ ఎక్కడ ఉంటుందో ముందే లేఖలో రాసి పెట్టి, ఆపై ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. గురుగ్రామ్‌లోని మొకల్‌వాస్ గ్రామానికి చెందిన నేహ (16), మైత్రి స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేసిన నేహ, చదువుకుంటానని చెప్పి తన గదిలోకి వెళ్లింది. అయితే, అందరూ నిద్రపోయాక స్కూల్ యూనిఫాం ధరించి ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది.
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సిసిటివి (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నేహ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ. 1 లక్ష బహుమతి కూడా ప్రకటిస్తూ గాలింపు చేపట్టారు. పోలీసులు నేహ గదిని శోధిస్తుండగా ఆమె రాసిన ఒక లేఖ లభ్యమైంది. అందులోని వాక్యాలు చూసి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. "అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. నేను మా తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను. నా కోసం వెతకకండి. ఒకవేళ వెతకాలనుకుంటే స్మశానవాటికలోని చెరువులో వెతకండి, నేను అక్కడే ఉంటాను" అని ఆ లేఖలో పేర్కొంది.
లేఖలో నేహ చెప్పిన సమాచారం ప్రకారం, పోలీసులు స్థానిక స్మశానవాటిక సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి గాలించగా ఆమె మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. నీటిలో మునిగిపోవడం వల్లే ఆమె చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేహ చదువులో ఎంతో చురుకైన విద్యార్థిని. ఆమె తండ్రి కోర్టు లైబ్రరీలో పనిచేస్తున్నారు. అయితే ఆమె అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటనేది ఆ లేఖలో కానీ, ప్రాథమిక విచారణలో కానీ స్పష్టంగా తెలియలేదు. పోలీసులు ఆమె స్నేహితులు, పాఠశాల పరిసరాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని, వారికి అందాల్సిన భావోద్వేగ మద్దతు అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.