అమెరికాలో కాల్పుల కలకలం, బాపట్లకు చెందిన వ్యక్తి మృతి
భారత్‌కు చెందిన ఎంతో మంది యువత విదేశాలకు ఉన్నతచదువులు, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 6:00 AM GMTఅమెరికాలో కాల్పుల కలకలం, బాపట్లకు చెందిన వ్యక్తి మృతి
భారత్‌కు చెందిన ఎంతో మంది యువత విదేశాలకు ఉన్నతచదువులు, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు. అయితే.. గత కొద్ది కాలంగా ఇండియన్ స్టూడెంట్స్ విదేశాల్లో వివిధ ప్రమాదాలు, హత్యలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ (32) జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో అతను పని చేస్తున్నాడు. అయితే.. శనివారం మధ్యాహ్నం గోపీ కృష్ణ కౌంటర్‌లో కూర్చొని ఉన్నాడు. అప్పుడే ఒక దుండగుడు గన్‌తో మార్కెట్‌లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత తుపాకీ గురిపెట్టి గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు. దాంతో.. గోపీకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలాడు. దొంగ తనకు కావాల్సిన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
దుండగుడి కాల్పుల్లో గోపీకృష్ణ తీవ్రగాయాలపాలు అయ్యాడు. దాంతో.. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికిచేరుకుని ఆస్పత్రికి తరించారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచాడు. కాగా.. గోపీకృష్ణ చనిపోయాడని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణ స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గోపీకృష్ణ మృదేహాన్ని అప్పగించేందుకు ప్రజాప్రతినిధులు తమకు సాయం చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.