కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించలేకపోతున్నానన్న బాధతో శనివారం ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని తాపీలో జరిగింది. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ పోరుకు దారితీసింది. బకుల్ పటేల్ (46) డిసెంబర్ 15న గొడ్డా గ్రామంలో పురుగుమందు తాగి తన జీవితాన్ని ముగించాడు. పోలీసుల కథనం ప్రకారం.. బకుల్ పటేల్ తన కుమార్తె కళాశాల ఫీజు చెల్లింపు గురించి ఆందోళన చెందుతూ తన జీవితాన్ని ముగించాడు. అయితే ఆత్మహత్యకు కారణం అదేనా అనేది మాత్రం నిర్థారణ కాలేదు.
బకుల్ పటేల్ మృతిపై వచ్చిన వార్తా నివేదికను ట్యాగ్ చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా 21వ శతాబ్దంలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని అన్నారు. మహువ (షెడ్యూల్డ్ తెగ) స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే మోహన్ ధోడియా స్పందిస్తూ.. మరణించిన వ్యక్తి తనకు బాగా తెలుసునని, పోలీసులు పేర్కొన్న కారణాల వల్ల అతను ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.