రోడ్డుప్రమాద ఘటన వద్ద కారు బీభత్సం, 9 మంది దుర్మరణం
గుజరాత్‌లో అప్పటికే జరిగిన రోడ్డుప్రమాద సంఘటన వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 20 July 2023 9:36 AM GMTరోడ్డుప్రమాద ఘటన వద్ద కారు బీభత్సం, 9 మంది దుర్మరణం
గుజరాత్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అప్పటికే జరిగిన రోడ్డుప్రమాద సంఘటన వద్ద కొందరు నిలబడి ఉన్నారు. అది చూసుకోకుండా గుంపుగా ఉన్న వ్యక్తులపైకి వేగంగా దూసుకొచ్చింది కారు. రోడ్డుప్రమాద సంఘటనను చూసేందుకు ఆగిన వారు.. మరో రోడ్డుప్రమాదంలో పడ్డారు. కారు అత్యంత వేగంగా రావడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు.
గుజరాత్‌లోని ఇస్కాన్ వంతెనపై ఓ జీపు, ట్రాక్కు ఢీకొన్నాయి. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు రోడ్డును క్లియర్ చేసేందుకు వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్నారు. ట్రక్కును, జీపును రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రోడ్డపై ప్రమాదం జరగడంతో అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఏం జరిగిందా అని చూసేందుకు ఆగారు. అలా కొంతమంది అక్కడే గుమిగూడారు. అప్పుడే ఒక కారు యముడి రూపంలో అత్యంత వేగంగా వచ్చింది. గుంపుగా ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. యాక్సిడెంట్ చేసిన వెంటనే సుదురు కారు డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా.. మృతుల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్, హోంగార్డు ఉన్నట్లు తెలిపారు గుజరాత్ పోలీసులు.
ఒకదాని తర్వాత మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిందని స్థానికులు అంటున్నారు. కారు అత్యంత వేగంగా రావడంతోనే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. కారు తగిలిన వెంటనే గుంపులో ఉన్న చాలా మంది గాల్లోకి ఎగిరిపడ్డారని చెప్తున్నారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని రోదిస్తున్నారు. ఈ సంఘటనపై గుజరాత్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.