ప్ర‌మాదవ‌శాత్తు చెరువులో జారిప‌డి ముగ్గురు బాలికల మృతి

Girls falls into pond while taking selfie.సెల్‌పోన్ల‌లో ఎప్పుడైతే సెల్ఫీ కెమెరా అందుబాటులోకి వ‌చ్చిందో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 2:45 AM GMT
ప్ర‌మాదవ‌శాత్తు చెరువులో జారిప‌డి ముగ్గురు బాలికల మృతి

సెల్‌పోన్ల‌లో ఎప్పుడైతే సెల్ఫీ కెమెరా అందుబాటులోకి వ‌చ్చిందో అప్ప‌టి నుంచి యువ‌త‌కు సెల్పీ పిచ్చి ప‌ట్టుకుంది. తాము ఎక్క‌డ ఉన్నామో.. ఏం చేస్తున్నామో.. ప‌క్క‌న ఏం జ‌రుగుతుందో అన్న సృహా లేకుండా సెల్పీలు దిగుతున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు వ‌దిలిన ఘ‌ట‌న‌లు చూసిన‌ప్ప‌టికి కూడా వారిలో మార్పు రావ‌డం లేదు. తాజాగా ముగ్గురు బాలిక‌లు సెల్పీలు తీసుకుంటూ ప్ర‌మాద వ‌శాత్తు చెరువులో జారీ ప‌డి మృతి చెందారు. ఈ ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లా సింగ‌న్‌గావ్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం సింగన్‌గావ్‌ గ్రామానికి చెందిన ఎల్మే దాదారావు, మంగళబాయి దంపతుల కుమార్తెలు స్మిత(16), వైశాలి(14) ఉన్నారు. స్మిత హైదరాబాద్‌లోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో ఇంట‌ర్‌, వైశాలి బాసరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. శనివారం వీరి ఇంటికి బంధువుల అమ్మాయి మహారాష్ట్రలోని మూకేడ్‌కు చెందిన అంజలి(14) వచ్చింది.

ఆదివారం ఆన్‌లైన్ కాసులు లేక‌పోవ‌డంతో ముగ్గురు క‌లిసి చేనుకు వెళ్లారు. మ‌ధ్యాహ్నాం ఎండ ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇంటికి వెళ్లాల‌ని మంగ‌ళ‌బాయి చెప్పింది. అప్ప‌టి వ‌ర‌కు చేనులో సెల్పీలు దిగిన వారు.. ఇంటికి వెలుతున్నారు. మార్గ‌మ‌ధ్యంలో చెరువు ద‌గ్గ‌ర ఆగారు. అక్క‌డ చెప్పులు వ‌దిలి..చెరువు గ‌ట్టున సెల్పీలు తీసుకునేందుకు య‌త్నించారు. సెల్పీలు తీసుకునే క్ర‌మంలో కాలుజారీ నీటిలో ప‌డిపోయారు. వారికి ఈత రాక‌పోవ‌డం.. ఆ స‌మ‌యంలో ఆచుట్టు ప‌క్క‌ల ఎవ‌రూ లేక‌పోవ‌డంతో నీటిలో మునిగిపోయారు.

చేను నుంచి ఇంటికి వ‌చ్చిన మంగ‌ళ‌బాయికి పిల్ల‌లు క‌నిపంచ‌లేదు. దీంతో బంధువులు, పంట చేను స‌మీపంలో వెతికారు. వారు క‌నిపించ‌పోయే స‌రికి అర్థ‌రాత్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం చేలకు వెళ్లే రైతులు చెరువు వద్ద చెప్పులను గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్థులు, కుటుంబ సభ్యు లు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని గమనించగా స్మిత, వైశాలి మృతదేహాలు చెరువులో తేలుతూ కనిపించాయి.

అంజలి మృతదేహాన్ని వెలికితీసి ఒడ్డుకు చేర్చడానికి గజ ఈతగాళ్లకు రెండు గంటలు పట్టింది. పిల్ల‌ల మృత‌దేహాల‌ను చూసి క‌న్న‌వారు రోధించిన తీరు అక్క‌డ ఉన్న‌వారిని కంట‌త‌డి పెట్టించాయి. కాగా.. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story