ప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంట్లో యువతి చోరీ.. అరెస్ట్
మంచిర్యాల జిల్లాలో ఓ యువతి ప్రియుడితో కలిసి సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీకి పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 9:18 AM ISTప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంట్లో యువతి చోరీ.. అరెస్ట్
మంచిర్యాల జిల్లాలో ఓ యువతి ప్రియుడితో కలిసి సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఆ తర్వాత తనకేం తెలియనట్లు ప్రవర్తించింది. కానీ.. పోలీసులు తమ విచారణ ఆధారాలు సేకరించారు. తద్వారా యువతి చేసిన దొంగతనాన్ని బట్టబయలు చేశారు. సదురు యువతితో పాటు.. ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపుతోంది.
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చోటుచేసుకుంది ఈ సంఘటన. హైదరాబాద్ చదువుకుంటున్న యువతి ఇటీవల వేసవి సెలవుల కారణంగా అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ యువతి తరచూ ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుండేది. ఈ క్రమంలోనే గేమ్స్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక నస్పూర్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన యువతి.. ఆమె ప్రియుడితో తరచూ మాట్లాడేది. ఒకానొక సమయంలో అమ్మమ్మ ఇంట్లోని బీరువాలు నగదు, నగలను చూసి దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా చోరీ చేయాలనుకుంది. ఈ విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పింది. అతను కూడా ఓకే అన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు చోరీకి ప్లాన్ చేసుకున్నారు.
మే 27వ తేదీ సాయంత్రం చోరీకి ఐడియా వేశారు. తాత సింగరేని ఉద్యోగానికి వెళ్లాడు. అదే సమయంలో వాకింగ్‌కు అమ్మమ్మ బయటకు వెళ్లింది. దాంతో.. అదే అదనుగా భావించి ప్రియుడిని పిలిపించి చోరీ చేసింది యువతి. బీరువా పగలగొట్టి రూ.4.5 లక్షల నగదు, 15 తులాల బంగారం, 30 తులాల వెండిని అపహరించారు. సొత్తుతో ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోగా.. యువతి ఇంటికి తాళం వేసి తనకేం తెలియదన్నట్లు బయటకు వెళ్లింది.
తిరిగి అమ్మమ్మతో పాటే ఇంటికి వచ్చింది. తాళం తెరిచి చూడగా ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. మంచిర్యాల పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనాస్థలంలో ఫింగర్ ప్రింట్స్, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ఇంటి దొంగలే ఈ పనిచేశారని గుర్తించారు. యువతిని గట్టిగా నిలదీసి అడగడంతో చేసిన తప్పుని ఒప్పుకుంది. ఈక్రమంలోనే యువతి, ఆమె ప్రియుడితో పాటు రెండు సెల్‌ఫోన్లు, బైక్ సీజ్ చేశారు పోలీసులు, ఆ తర్వాత ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.