కర్ణాటకలోని భగల్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. దొంగతనం చేసిందనే నెపంతో టీచర్ విద్యార్థినిని వేధించింది. దాంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన సదురు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపుతోంది.
కర్ణాటక భగల్‌కోట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ 14 ఏళ్ల విద్యార్థి టెన్త్ క్లాస్ చదువుతోంది. ఆ బాలిక రూ.2వేలు దొంగతనం చేసిందని టీచర్ జయశ్రీ మిశ్రికోటి రోజూ వేధించడం ప్రారంభించింది. ఎందుకు డబ్బులు తీశావ్..? ఎవరికి ఇచ్చావ్..? ఏం చేశావంటూ నిలదీయసాగారు. ఈ టీచర్‌తో పాటు హెడ్‌మాస్టర్ కేహెచ్ ముజావర్ కూడా బాలికను నిందించాడు. హెడ్‌మాస్టర్, టీచర్ వేధింపులు నిత్యం ఉండటంతో భరించలేకపోయింది విద్యార్థిని. దాంతో.. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనం నెపంతో బాలిక బట్టలు విప్పించి, తనిఖీ చేసినట్లు తోటి విద్యార్థులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. తనను స్కూల్ నుంచి తీసివేస్తే అవమానంగా ఉంటుందని బాధితురాలు ఎనిమిదవ తరగతి విద్యార్థిని వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఇక తన పరువు పోయిందనీ.. పైగా వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత బాలిక ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.