ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగుచూసింది. పనికి వెళ్తూ వర్షం నుంచి రక్షణ కోసం ఒక నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఐదుగురు కార్మికులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ బాలిక ఒక కేర్ హోమ్‌లో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలిక పనికి వెళ్తున్న సమయంలో భారీ వర్షం కురవడంతో, సమీపంలోని ఒక భవన నిర్మాణ స్థలంలో తలదాచుకుంది. అక్కడ పనిచేస్తున్న ఒక కార్మికుడు ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లగా, మిగిలిన వారు బయట కాపలాగా నిలబడ్డారు.
బాలిక ప్రతిఘటించడంతో నిందితులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా కొట్టారు. అనంతరం ఆమెపై విచక్షణారహితంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక సమయానికి పనిలోకి రాకపోవడంతో ఆమె యజమాని ఆందోళన చెంది గాలింపు చేపట్టింది. స్థానికులకు అనుమానం వచ్చి నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో వెతకగా, బాలిక వివస్త్రగా, గాయాలతో పడి ఉండటం కనిపించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు భవనం పైకప్పు మీద ఉన్న వాటర్ ట్యాంక్ వెనుక దాక్కున్న నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో సీతాపూర్ జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.