సామాజిక మాధ్యమాలే అడ్డాగా.. మోసాలకు పాల్పడుతున్న కి 'లేడి' అరెస్ట్
Girl cheating on social media platform.సోషల్ మీడియా వేదికగా అబ్బాయిలకు వల వేస్తుంది. వారిని నమ్మించి చాటింగ్ చేస్తుంది.
By తోట వంశీ కుమార్ Published on 2 May 2021 4:39 AM GMTసోషల్ మీడియా వేదికగా అబ్బాయిలకు వల వేస్తుంది. వారిని నమ్మించి చాటింగ్ చేస్తుంది. వలపు వల విసిరి అసభ్యకర రీతిలో వీడియో చాట్ చేసి.. వాటిని భద్రపరుస్తుంది. అనంతరం వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుంది. అంతేకాదు.. నకిలీ పేర్లతో పెద్ద పెద్ద సంబంధాలు సెట్ చేస్తానంటూ అమ్మాయిల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దండుకుంటున్న ఈ కిలేడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ఇందు దాసరి అలియాస్ ధరణి రెడ్డిపై వచ్చిన ఫిర్యాదు విచారించి నల్లగొండ వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. మహేశ్వరీ కొద్ది రోజులుగా సోషల్ మీడియా ద్వారా వలపు వల విసురుతూ డబ్బులు దండుకోవడంతో పాటు పెళ్లి సంబంధాల పేరిట పలువురిని మోసం చేసిందని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేశ్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత అతడితో అభ్యంతరకరంగా చాటింగ్ చేసింది. అనంతరం ఆ వీడియోలు చూపించి బెదిరిస్తూ డబ్బులు గుంజుతోంది. ఆమె బారినపడి మూడు నెలలుగా విలవిల్లాడుతున్న వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. అలాగే.. మరికొందరు యువతులతో పరిచయం పెంచుకుని వారికి పెళ్లి సంబంధాలు చూస్తానని చెప్పి మోసాలకు పాల్పడింది. వారి తల్లిదండ్రుల నుంచి ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసింది. ఇలా మొత్తంగా రూ.11.70 లక్షలు దండుకుందన్నారు.
నల్లగొండ వన్‌టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న ఆమెను శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు తెలిపారు. మహేశ్వరిపై కూకట్‌పల్లి, ఘట్‌కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు, కరీంనగర్, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు ఎస్పీ వెల్లడించారు.