ఉద్యోగం ఇప్పిస్తామని న‌మ్మ‌కంగా చెబుతారు.. తీరా

హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను మోసగించిన నలుగురు వ్యక్తులను మారేడ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు.

By Medi Samrat  Published on  28 Jan 2025 8:48 PM IST
ఉద్యోగం ఇప్పిస్తామని న‌మ్మ‌కంగా చెబుతారు.. తీరా

హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను మోసగించిన నలుగురు వ్యక్తులను మారేడ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. గడ్డపొల్ల పవన్ కుమార్ (34), బోగ రేవంత్ (39), బాపతు రాజీవ్ రెడ్డి (32), సక్కినల సుధీర్ (39)లను అరెస్టు చేశారు పోలీసులు.

హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠా, ప్రముఖ ఎంఎన్‌సిల నుండి నకిలీ ఆఫర్ లెటర్‌లతో ఉద్యోగార్ధులకు ఎర వేస్తారు. తాము చెప్పిన అమౌంట్ ఇస్తే కొన్ని రోజుల్లో మీకు ఆ కంపెనీల్లో ఉద్యోగం ఉంటుందని నమ్మిస్తారు. అలా 13 మంది దగ్గర నుండి రూ.26.25 లక్షలు మోసం చేశారు.

జాబ్ కన్సల్టింగ్‌లో అనుభవం ఉన్న సుధీర్ ద్వారా పవన్ కుమార్ అభ్యర్థులను ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌లు సేకరించి పవన్‌కు పంపేవాడు సుధీర్. రెజ్యూమెలను పవన్ .. రేవంత్‌కి ఫార్వార్డ్ చేసేవాడు. నకిలీ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా నటిస్తూ రేవంత్ ఉద్యోగం గురించి అభ్యర్థులకు వివరించి, ఫోన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 2024లో రేవంత్ ముఠాలో చేరినట్లు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా పవన్‌తో పరిచయం ఉన్న సుధీర్‌, రాజీవ్‌ రెడ్డిని అతనికి పరిచయం చేశాడు. ఓ వెబ్‌సైట్‌ను ఉపయోగించి వివిధ కంపెనీల పేర్లతో నకిలీ ఇమెయిల్ ఐడీలను సృష్టించడం రాజీవ్ రెడ్డి పని. పవన్ నకిలీ జాబ్ లెటర్‌లను సృష్టించి, అమాయక ఉద్యోగార్ధులకు ఫార్వార్డ్ చేసేవాడు. ఆ తర్వాత మీకు ఉద్యోగం గ్యారెంటీ అంటూ పలువురిని మోసం చేయడం మొదలుపెట్టారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5.67 లక్షలతో పాటు మరో మూడు నకిలీ జాబ్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story