ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును అలా కూడా వాడుకున్నారు.. జర జాగ్రత్త..!

Fraud in the name of MLC kavitha.ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును కొందరు కేటుగాళ్లు విపరీతంగా వాడుకుంటూ ఉన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 6:24 PM IST
Fraud in the name of MLC kavitha

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును కొందరు కేటుగాళ్లు విపరీతంగా వాడుకుంటూ ఉన్నారు. ఎంతలా అంటే.. ఓ వ్యక్తి నుంచి ఆరున్నర లక్షల రూపాయలు కొట్టేసేదాకా..! ఇద్దరు కేటుగాళ్లు కామారెడ్డిలో బడా మోసానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. కామారెడ్డికి చెందిన మహేశ్, వినోద్‌లు తాము యూట్యూబ్ చానల్ విలేకరులమని చెప్పుకునేవారు. ఇటీవల వీరు మహమ్మద్ అనే వ్యక్తిని కలిసి తాము కొత్తగా న్యూస్ చానల్ ప్రారంభిస్తున్నామని, దీనికి ఎమ్మెల్సీ కవిత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. అంతే అతడు నమ్మేశాడు.

చానల్‌కు డైరెక్టర్‌గా తీసుకుంటామంటూ అతడి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని మరో రూ. 4 లక్షలు వసూలు చేశారు. మహమ్మద్‌ను కలిసి చానల్ ప్రారంభించడంలో కొంత ఆలస్యం జరుగుతోందని, కాబట్టి మరో చానల్‌లో ఫొటోగ్రాఫర్‌గా చేరుస్తామని నమ్మించారు. ఐడీకార్డు కోసం రూ. 50 వేలు వసూలు చేశారు. అయినప్పటికీ ఐడీ కార్డు రాకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఖతార్ లో డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహమ్మద్ ని చానల్ కు చైర్మన్ గా చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ఇండియాకు రప్పించారు. ఎమ్మెల్సీ కవిత ఫొటోతో పాటు బాధితుని ఫోటో పెట్టి ఓ చానల్ చైర్మన్ గా సరిఫికెట్ సృష్టించి నువ్వే చానల్ చైర్మన్ అని చెప్పారని సదరు బాధితుడు పోలీసుల దగ్గర వాపోయాడు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఇండియాకు వచ్చాడు మహమ్మద్. అతడు రాగానే నువ్వు వచ్చావని ఎమ్మెల్సీ కవిత నీకు శాలువా పంపించిందని నమ్మించారు. అతడిని చానల్ కు చైర్మన్ గా నియమించినట్టు కొన్ని పేపర్లను ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఫోటో, బాధితుని ఫొటోలతో కూడిన సర్టిఫికెట్ అందజేశారు. కామారెడ్డిలో ఒకటి, వేములవాడలో ఒకటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వచ్చాయని.. వాటికి సంబంధించిన తాళాలను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కవితక్కతో పర్సనల్ గా మాట్లాడవచ్చని చిన్న వాకిటాకీ కూడా ఇచ్చారట..!

'నాకు ముగ్గురు కూతుళ్ళు కవితక్కా..! నాకు న్యాయం చెయ్యండి. నేను మోసపోయాను. వాళ్ల నుంచి నాకు ప్రాణహాని కూడా ఉంది. నా వద్ద దాదాపు ఆరు లక్షల యాభై వేలరూపాయలు తీసుకున్నారు. ప్రస్తుతం నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదు' అని బాధగా చెప్పుకొచ్చాడు.


Next Story