పార్టీ అంటూ విమానంలో హల్‌చల్ చేసిన మందుబాబులు
ఇండిగో విమానంలో మద్యం బాబులు హల్‌చల్ చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 9:30 PM ISTపార్టీ అంటూ విమానంలో హల్‌చల్ చేసిన మందుబాబులు
మద్యం సేవిస్తూ ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరు మద్యానికి బానిసై ఘాతుకాలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. అయితే.. నలుగురు మద్యం బాబులు తాజాగా విమానంలో హల్‌చల్ చేశారు. పార్టీ చేసుకుంటామంటూ ఫుల్లుగా మద్యం సేవించి నానా రచ్చ చేశారు. విమాన సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారు ఏమాత్రం వినిపించుకోలేదు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. ఇక చివరకు కటకటాల పాలయ్యారు.
ఇండిగో విమానంలో మద్యం బాబులు హల్‌చల్ చేశారు. కేరళకు చెందిన డేవిస్, మనోజ్, శివకుమార్, డేవసి కుట్టి ఈ నలుగురూ దోహా నుండి కొచ్చిన్ వెళ్తున్నారు. ఆ సమయంలో విమానంలో మందు పార్టీ చేసుకోవడానికి మందు బాటిల్స్ ఓపెన్ చేశారు. అయితే వీరిని విమానం సిబ్బంది అడ్డుకున్నారు. మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ విమాన సిబ్బంది పట్ల దురుసగా ప్రవర్తించారు తాగుబోతులు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిని క్యాబిన్‌లోకి నెట్టేసి పీకలదాకా తాగారు. ఆ తర్వాత మత్తులో తూగుతూ నానా హంగామా చేశారు. నలుగురు తాగుబోతులు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. అంతేకాదు.. విమానంలో ఉన్న మిగతా సిబ్బందితోనూ అనుచితంగా ప్రవర్తిస్తూ విమానం ప్రమాదానికి గురయ్యేలా వీరంగం చేశారు. మందుబాబుల వ్యవహారంతో ప్రయాణికులంతా హడలిపోయారు.
ఇండిగో విమానాన్ని పైలట్లు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఆ తర్వాత నలుగురు మద్యం బాబులని కిందకు బలవంతంగా దింపి.. హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇండిగో విమాన సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్న మద్యం బాబుల మత్తు దిగాక విచారణ జరపనున్నారు. కాగా.. మద్యం మత్తులో విమానాల్లో మందుబాబులు హల్‌చల్ చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్నాయి. కానీ ఈసారి వీరు చేసిన వీరంగంతో అందరూ హడలిపోవడంతో.. చర్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.