విషాదం.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి
Five students and teacher drown in Andhra's Krishna river.సంధ్యావందనంతో పాటు స్నానం చేయడానికి కృష్ణా నదిలోకి దిగిన
By తోట వంశీ కుమార్ Published on 11 Dec 2021 2:38 AM GMTసంధ్యావందనంతో పాటు స్నానం చేయడానికి కృష్ణా నదిలోకి దిగిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద కృష్ణానదికి సమీపంలో శ్వేత శృంగాచలం వేద పాఠశాల ఉంది. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు అభ్యసించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వస్తుంటారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సంధ్యావందనంతో పాటు స్నానం చేసేందుకు గురువు సుబ్రమణ్యశర్మ శర్మతో పాటు ఏడుగురు విద్యార్థులు కృష్ణా నది వద్దకు వెళ్లారు.
ఇద్దరు విద్యార్థులు గట్టుపై ఉండగా.. మిగిలిన వారు నదిలోకి దిగారు. అయితే.. ఓ విద్యార్థి నది లోతును అంచనా వేయలేక.. లోతట్టు ప్రాంతంలోకి వెళ్లగా నీటిలో మునిగిపోయాడు. ఆ విద్యార్థిని రక్షించే క్రమంలో మిగిలిన విద్యార్థులు, గురువు కూడా నీటిలో మునిగిపోయాడు. గట్టుపైన ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో జాలర్లు అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన విద్యార్థుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన శివ శర్మ (14), ఉత్తరప్రదేశ్‌కు చెందిన నితీష్‌కుమార్ దీక్షిత్ (15), హిర్షత్ శుక్లా (15), శుభం త్రివేది (15), అనూష్‌మాన్ శుక్లా (14) ఉన్నారు. గురువు కేతేపల్లి వెంకట సుబ్రమణ్యశర్మ(26) గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను నీటిలోంచి వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.