కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు కరోనా పేషెంట్లు మృతి

Five people died after a fire broke out at covid hospital .. ఈ మధ్య కాలంలో కరోనా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు భారీగానే

By సుభాష్  Published on  27 Nov 2020 3:47 AM GMT
కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు కరోనా పేషెంట్లు మృతి

ఈ మధ్య కాలంలో కరోనా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కారణంగా అమాయక పేషెంట్లు అగ్నికి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుజరాత్‌లోని విషాదం చోటు చేసుకుంది. రాజ్‌కోటలోని కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. మాద్వీ ప్రాంతంలోని ఉదయ్‌ శివానంద్‌ ఆస్పత్రిలో సుమారు 33 మంది వరకు కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కాగా, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఐసీయూలో ఉన్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకురాగా, మిగతా ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. అయితే షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. అగ్నిప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story