భర్త రెండో భార్యను ట్రాప్ చేసి చంపిన మొదటి భార్య
First wife killed her husband's second wife. భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో రెండో భార్యపై మొదటి భార్య కక్షను పెంచుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2021 6:11 AM GMTఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. అయితే.. కొన్నాళ్ల క్రితం భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో రెండో భార్యపై మొదటి భార్య కక్షను పెంచుకుంది. ఆమె అడ్డుతొలగించుకునేందుకు తన తమ్ముడితో కలిసి రెండో భార్యను హత్యచేసింది. ఈ దారుణ ఘటన రాయదుర్గం పోచమ్మ బస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఓల్డ్ సిటీలోని హరిబౌలి ప్రాంతానికి చెందిన భాస్కర్.. అదే ప్రాంతానికి చెందిన జానకి(31)ని ప్రేమించి 2013లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజర్స్‌గా పనిచేస్తూ.. రాయదుర్గంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
జానకి కి స్రవంతి(32) అనే ఫ్రెండ్ ఉండేది. ఆమె కూడా వీరితో కలిసి ఈమెంట్స్ చేసేది. స్రవంతి మూడేళ్ల క్రితం తన భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో భాస్కర్‌తో స్రవంతికి ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో జానకితో భాస్కర్‌కి తరుచూ గొడవలు జరుగుతుండేది. ఈ క్రమంలో భాస్కర్ గతేడాది స్రవంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం స్రవంతి ఆరు నెలల గర్భిణి. కొంతకాలంగా జానకి, స్రవంతి ల మధ్య కలతలు చెలరేగాయి. స్రవంతి తన లైఫ్ కి అడ్డొస్తోందని జానకి ఆమెపై కక్ష పెంచుకుంది. తన తమ్ముడు గుండా లక్ష్మినారాయణ కృష్ణ ప్రసాద్(27) తో కలిసి స్రవంతిని హత్యకి ప్లాన్ వేసింది.
శుక్రవారం జానకి.. స్రవంతికి కాల్ చేసి మాట్లాడుకుందామని.. రాయదుర్గంలోని తన ఇంటికి రావాలని చెప్పింది. గర్భిణిగా ఉన్న స్రవంతి హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నట్టు ఇంట్లో పేరెంట్స్ కి చెప్పి అక్కడికి వెళ్లింది. ఆమె వచ్చే లోపు జానకి.. తన భర్తకు టీలో నిద్ర మాత్రలు ఇచ్చింది. అది తాగిన భాస్కర్ నిద్రలోకి జారుకున్నాడు. స్రవంతి వచ్చిన తరువాత కొద్ది సేపు మాట్లాడుకున్నాక.. ఆమె చున్నీతోనే తమ్ముడితో కలిసి ఉరి బిగించి హత్య చేశారు. పక్కనే ఉన్న గదిలో ఆమె మృతదేహాన్ని దాచారు. చెకప్‌కోసం వెళ్లిన తమ కుమారై ఇంకా ఇంటికి రాకపోవడంతో..స్రవంతి తల్లిదండ్రులు భాస్కర్‌కు ఫోన్ చేశారు. ఎక్కడ వెతికినా.. ఆమె ఆచూకి తెలియకపోవడంతో అదే రోజు రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భాస్కర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న కృష్ణ ప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. నిందితులు కృష్ణప్రసాద్ తో పాటు జానకిని అరెస్ట్ చేశారు.