ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‌పై దాడి
Firing on lorry driver at Outer Ring Road. హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగురోడ్డుపై తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కారులో వచ్చిన దుండగులు లారీ
By అంజి
హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగురోడ్డుపై తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కారులో వచ్చిన దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి ఔటర్ రింగ్‌రోడ్డుపై ఐరన్ లోడ్‌తో ఓ లారీ వెళ్తోంది. దాని వెంబడిస్తూ స్విఫ్ట్‌కారులో వచ్చిన దుండగులు శంషాబాద్ తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా లారీ డ్రైవర్‌పై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. కాల్పులు నుంచి తప్పించుకొని డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో లారీ అద్దాలు పగిలిపోయాయి.
దుండగుల నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్ వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. లారీ నెంబర్ ఎన్‌ఎల్ 01 ఏఎఫ్ 3226. లారీ డ్రైవర్ పేరు మనోజ్. లారీ ఐరన్ లోడ్‌తో మెదక్ నుంచి కేరళలోని కొచ్చి నగరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి గురించి పూర్తి వివరాలను డ్రైవర్ మనోజ్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాల్పులకు పాల్పడింది అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన దోపిడీ దొంగలు ఔటర్‌పై హల్‌చల్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. విలువైన వస్తువులు రవాణా చేసే లారీలు, కంటైనర్లను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వినకపోతే డ్రైవర్లను బెదిరించటం, హత్య చేయడం చేస్తున్నారు. ఇటీవల లారీ టైర్లు, సబ్బులతో వెళ్తున్న లారీలను అడ్డగించి దోచుకున్న ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రస్తుత ఘటనపై పోలీసుల దర్యాప్త కొనసాగుతోంది.