హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి భార్య సజీవదహనం కాగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ, సరస్వతి(43) దంపతులు ఎఫ్‌సీఐ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమారై ఉన్నారు. ఈరోజు ఉదయం(సోమవారం) 8 గంటల ప్రాంతంలో వారు నివసిస్తున్న ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బాలకృష్ణ.. తన ఇద్దరు పిల్లలకు బయటకు తీసుకువచ్చాడు. మళ్లీ లోనికి వెళ్లి భార్యను కాపాడేందుకు యత్నించాడు. కాగా.. అప్పటికే సరస్వతి శరీరమంతా మంటలు అంటుకున్నాయి. మంట్లో కాలి ఆమె సజీవ దహనమైంది.
సరస్వతి కాపాడే క్రమంలో బాలకృష్ణ కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోస్టుమార్టం నిమిత్తం సరస్వతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలకృష్ణను ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.