మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం పేటీఎం ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లసుడియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తారేష్ సోని తెలిపిన వివరాల ప్రకారం.. మేనేజర్ గౌరవ్ గుప్తా (40) ఇండోర్‌లోని స్కీమ్ నంబర్ 78లోని తన ఇంట్లో తెలియని కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపెనీ మూతబడితే ఉద్యోగం పోతుందనే భయంతో గౌరవ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కారణాల వల్ల మార్చి 15 తర్వాత ఖాతాదారుల నుండి డిపాజిట్లు, క్రెడిట్‌లను స్వీకరించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధించింది. ఇంకా ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితేంద్ర పట్వారీ మాట్లాడుతూ.. పేటీఎం మూతపడితే ఉద్యోగం పోతుందన్న భయంతోనే గౌరవ్ చనిపోయాడని, పేటీఎం సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
ఈ కేసులో ప్రమేయమున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌లో ప్రశ్నించారు. "కార్పోరేట్ విరాళాల పేరుతో ఈ సంక్షోభం కూడా పరిష్కారమవుతుందా? ఆపై, బీజేపీ ఖజానాలో చాలా డబ్బు ఉంటుందా ?" అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తన కస్టమర్ ఖాతాల్లోకి తదుపరి క్రెడిట్‌లను స్వీకరించేందుకు ఆర్‌బీఐ నిర్దేశించిన మార్చి 15 గడువు కంటే ముందు సోమవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు.