తగాదా పెడుతోందని కన్న కూతుర్ని చంపిన తండ్రి

రాజస్థాన్‌లో ఓ వ్యక్తి కన్న కూతురిని కత్తితో పొడిచి.. ఆ తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించి చంపేశాడు.

By Srikanth Gundamalla  Published on  29 Nov 2023 4:42 PM IST
father, murder,  daughter, rajasthan crime,

తగాదా పెడుతోందని కన్న కూతుర్ని చంపిన తండ్రి

రోజుకు రోజుకు మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలు గొడవలు పడుతున్నారు. కలిసి ఉండాలని.. సంతోషంగా ఉండాలనే విషయాన్ని మర్చిపోయి పంతాలకు పోతున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణలకు పాల్పడి.. పగలు పెంచుకుని దారుణాలకు ఒడికడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో ఓ వ్యక్తి కన్న కూతురిని కత్తితో పొడిచి.. ఆ తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించి చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

రాజస్థాన్‌లోని పాలి జిల్లా సిర్యారీ గ్రామానికి చెందిన శివలాల్‌ మేఘవాల్‌ కుటుంబ తగాదాలతో కుటుంబానికి దూరంగా గుజరాత్‌లో ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు నిర్మల. 32 ఏళ్లు. ఈమె కూడా పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరంగానే ఉంటుంది. అయితే.. మంగళవారం వీరి స్వగ్రామం సిర్యారీలో ఒక పెళ్లి ఉంది. దాంతో.. వీరంతా ఆ వివాహానికి హాజరు అయ్యారు. పెళ్లి వేడుక తర్వాత తన వెంట రావాలని ఇద్దరు కూతుళ్లను కోరాడు శివలాల్. తన బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు. కాసేపటికి నిర్మాణుష్య ప్రాంతానికి చేరుకున్నాడు.

ఇద్దరినీ బైక్‌ దిగమని చెప్పి.. పెద్ద కూతురు నిర్మలతో మాట్లాడాలని కాస్త దూరంగా తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోశాడు. దాంతో.. తీవ్రంగా రక్త స్రావమై నిర్మల స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. తండ్రి, అక్కడ ఎంతసేపటికీ రాకపోవడంతో చిన్న కూతురు అక్కడి వెళ్లి చూసింది. అప్పటికే నిర్మలను హత్య చేసిన తండ్రి శివలాల్‌... పెట్రోల్‌ పోసి నిప్పంటించడం గమనించింది. దాంతో.. భయపడిపోయిన ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ గ్రామానికి వెళ్లి అక్కడున్నవారికి విషయం చెప్పింది. ఆ తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిర్మల డెడ్‌బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. కుటుంబంలో తగదాలు జరుగుతున్న కారణంగానే నిర్మలను శివలాల్ హత్య చేసి ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు.

Next Story