దారుణం.. కొడుకు న‌ష్ట‌జాత‌కుడ‌ని.. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తండ్రి

Father killed four year old son in tiruvarur district.కొడుకు న‌ష్ట‌జాతకుడ‌ని ఓ జోతిష్యుడు చెప్ప‌డంతో అభం, శుభం తెలియ‌ని నాలుగేళ్ల చిన్నారి ఒంటికి నిప్పంటించి దారుణంగా హ‌త్య చేశాడో తండ్రి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2021 5:10 PM IST
Father killed four year old son in tiruvarur district

టెక్నాల‌జీ ఎంత పెరిగినా కొంద‌రు మంది మాత్రం మూఢ నమ్మ‌కాల‌ను విడ‌నాడ‌డం లేదు. ఆ మ‌ధ్య దీని కార‌ణంనే చిత్తూరు జిల్లాలో క‌న్న‌కుమారైల‌ను చంపేశారు త‌ల్లిదండ్రులు. ఆ ఘ‌ట‌న నుంచి ఇంకా తేరుకోక‌ముందే త‌మిళ‌నాడులో దారుణం జ‌రిగింది. కొడుకు న‌ష్ట‌జాతకుడ‌ని ఓ జోతిష్యుడు చెప్ప‌డంతో అభం, శుభం తెలియ‌ని నాలుగేళ్ల చిన్నారి ఒంటికి నిప్పంటించి దారుణంగా హ‌త్య చేశాడో తండ్రి.ఫిబ్ర‌వ‌రి 25న తిరువారూర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. తిరువారూర్‌లోని న‌న్నిళం ప్రాంతంలో రాంకీ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌డు ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

జోతిష్య శాస్త్రాన్ని విప‌రీతంగా న‌మ్మేవాడు. ఈ క్ర‌మంలో ఓ జ్యోతిష్కుడిని క‌లిసాడు. నీ కుమారుడు న‌ష్ట‌జాత‌కుడు. అత‌డు పెరుగుతున్నా కొద్ది నీకు ఇబ్బందులు త‌ప్ప‌వు అని చెప్పాడు. అంతేకాదు.. కుమారుడి వ‌ల్ల రాంకీ ప్రాణహాని ఉంద‌ని.. కొడుకుకు ఓ 15 సంవ‌త్స‌రాల పాటు దూరంగా ఉండాలంటూ ఆ జ్యోతిష్కుడు రాంకీకి చెప్పాడు. జ్యోతిష్కుడి మాట‌ల‌ను న‌మ్మిన రాంకీ త‌న కొడుకు కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కుమారుడిని త‌న బంధువుల ఇంట్లో ఉంచేందుకు నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే.. ఇందుకు రాంకీ భార్య ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. చిన్న గొడ‌వ కాస్త పెద్ద‌దిగా మారింది.

ఆ స‌మ‌యంలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న రాంకీ.. త‌న నాలుగేళ్ల కుమారుడి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంట‌నే స్పందించిన త‌ల్లి మంట‌ల‌ను ఆర్పి స్థానికుల సాయంతో కుమారుడిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. అయితే.. అప్ప‌టికే ఆ చిన్నారి శ‌రీరం 90శాతం కాలిపోయింది. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు రాంకీని అదుపులోకి తీసుకున్నారు.


Next Story