కన్న కొడుకు అప్పులు చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పుల వాళ్లు ఇంట్లో ఉన్న వారిని అప్పు తీర్చాలని ఒత్తిడి చేశారు. అవమానం భరించలేక ఆ కుటుంబం ఓ దారుణ నిర్ణయాన్ని నిర్ణయాన్ని తీసుకుంది. ఆ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని రాచపాలెంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాచపాలెం గ్రామంలో శంకరయ్య(55), గురువమ్మ(50) దంపతులు నివసిస్తున్నారు. వీరికి సతీష్, వినయ్(25) సంతానం. పెద్ద కుమారుడు సతీష్.. తనకు పరిచయం ఉన్న వారి వద్ద నుంచి అప్పులు చేశారు. దాదాపు కోటిన్నర పైగా అప్పు చేసి ఇంటి నుంచి పారిపోయాడు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తాము ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆ అప్పు తలకుమించిన భారం కావడం, అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తుండడంతో మనస్థాపానికి గురైయ్యారు. తమ పరువు పోయినట్లు బావించారు. దీంతో శంకరయ్య. గురువమ్మ వారి చిన్నకుమారుడు వినయ్ దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.