Medchal: నకిలీ పోలీస్ ఆట కట్టించిన పోలీసులు

నకిలీ పోలీస్‌ అవతారం ఎత్తి ఉద్యోగార్థులను మోసం చేస్తున్న కేటుగాడి ఆట కట్టించారు మేడ్చల్‌ పోలీసులు.

By Srikanth Gundamalla  Published on  19 Sep 2023 10:45 AM GMT
Fake police, Arrested, medchal, Crime,

Medchal: నకిలీ పోలీస్ ఆట కట్టించిన పోలీసులు

ఓ యువకుడు చదువుకుంటున్న సమయంలో పోలీస్ కావాలని కలలు కన్నాడు. కానీ పోలీస్ కావడానికి చదువుతోపాటు కఠిన శిక్షణ ఉంటుందని తెలుసుకొని... అది తన వల్ల కాదని భావించి నకిలీ పోలీస్ అవతారం ఎత్తాడు. అంతే కాదండోయ్ పోలీస్ ఉద్యో గాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు ఈ మహానుభావుడు. కానీ ఎట్టకేలకు పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో పాపం ఈ నకిలీ పోలీస్ కాస్త స్టేషన్ సెల్‌లో పడ్డాడు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ మండలం చౌదరిగుడా గ్రామంలోని వెంకట సాయి నగర్‌లో నివాసం ఉంటున్న కుసుమ ప్రశాంత్ (26) అనే యువకుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. పోలీస్ అవతారం ఎత్తి పలువురిని మోసం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు ఈ ప్రబుద్ధుడు వెంటనే ఒక పోలీస్ యూనిఫామ్, బూట్లు కొనుక్కొని పోలీస్ అవతారం ఎత్తాడు. ఆ విధంగా పోలీస్ అవతారం ఎత్తిన ప్రశాంత్ తాను ఎస్ఐ అని నమ్మిస్తూ... పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి పలువురిని నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేశాడు. అయితే ప్రశాంత్ చెప్పిన మాయమాటలు నమ్మి అతడి మాయాజాలంలో ఇరికిన ఓ బాధితుడు లక్షల్లో డబ్బులు కోల్పోయాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

ప్రశాంత్ పై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో 170, 406, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి నకిలీ ఎస్ఐ గా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్న ప్రశాంత్ పై నిఘా పెట్టారు. అయితే ప్రశాంత్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న పోలీసు అభ్యర్థుల వద్దకు వెళ్లి తాను ఆర్ఎస్ఐ అంటూ వారిని నమ్మించి బురిడీ కొట్టించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం ఘట్కేసర్ పోలీసులు నకిలీ పోలీస్ ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుండి పోలీస్ యూనిఫామ్, షూలు, రెండు మొబైల్ ఫోన్లతో పాటు.. రూ. 21,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసాలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story