CMRF చెక్కుల కేసులో అరెస్ట్‌ అయిన నరేశ్‌తో ఎలాంటి సంబంధం లేదు: హరీశ్‌రావు కార్యాలయం

లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  27 March 2024 10:26 AM GMT
harish rao, data entry operator, arrest, jubilee hills police,

CMRF చెక్కుల కేసులో అరెస్ట్‌ అయిన నరేశ్‌తో ఎలాంటి సంబంధం లేదు: హరీశ్‌రావు కార్యాలయం

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల గోల్‌మాల్‌ కేసులో ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన దూమ రవినాయక్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను గోల్‌మాల్‌ చేశారని నమోదైన కేసులో హరీశ్‌రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన నరేశ్‌తో పాటు.. కొర్లపాటి వంశీ, వెంకటేశ్ గౌడ్, ఓంకార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పొలం పనులు చేస్తుండగా ఫిర్యాదు దారుడు రవినాయక్‌ భార్య పాముకాటుకు గురైంది. సంగారెడ్డిలోని ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. కానీ.. ఆమె చికిత్స పొందుతు నవంబర్ 6వ తేదీన చనిపోయింది. అప్పటికే ఆస్పత్రి ఖర్చుల కోసం రవి నాయక్‌ రూ.5లక్షలు పెట్టాడు. ఇక భార్య మరణం తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం సీఎంవోలో సంప్రదించాడు. అప్పుడు అసలు గుట్టురట్టయింది. రవి నాయక్ భార్య పేరిట సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు అయ్యిందని వారు చెప్పారు. జోగు నరేశ్ అనే వ్యక్తి చెక్కులు తీసుకున్నారని అధికారులు చెప్పారు.

ఇక తమ పేరిట వచ్చిన చెక్కులను నరేశ్ కుమార్ తీసుకున్నాడని గుర్తించాడు. అతను మోసం చేశాడని భావించిన రవినాయక్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారిపై U/s 417, 419, 420, 120(b) r/w 34 IPC, సెక్షన్ 66(B) & 66(C) IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నరేశ్‌తో మాకు సంబంధం లేదు: హరీశ్‌రావు కార్యాలయం

డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్‌పై హరీశ్‌రావు కార్యాలయం స్పందించింది. ఈ మేరకు వివరణ ఇచ్చింది. హరీశ్‌రావు ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత 6-012-2023న కార్యాలయాన్ని మూసివేసి, సిబ్బందిని పంపేశామని తెలిపింది. ఆ రోజు నుంచి నరేశ్ అనే వ్యక్తికి, హరీశ్‌రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అయితే.. ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట నరేశ్ తీసుకెళ్లినట్లు తమకు సమాచారం అందిందని హరీశ్‌రావు కార్యాలయం తెలిపింది.

ఈ మేరకు నరేశ్‌పై 17-12-2023వ తేదీనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హరీశ్‌రావు కార్యాలయం తెలిపింది. చట్ట ప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని అప్పుడే కోరినట్లు వివరించింది. కాబట్టి.. నరేశ్ అనే వ్యక్తితో హరీశ్‌రావుకి, కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఈ వాస్తవాలను గుర్తించాలనీ.. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది హరీశ్‌రావు కార్యాలయం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతేంటే నిరుపేదలకు తమ కార్యాలయం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకుండానే ఎన్నో విధాలా చేసిందని హరీశ్‌రావు కార్యాలయం వివరించింది. ఇలాంటి తప్పుడు వార్తలను రాయడం మానుకోవాలని సూచించింది.

Next Story