తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు.. అఖిల ప్రియ అరెస్ట్
Ex Minister Bhuma Akhilapriya arrested.తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్.
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2021 12:56 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లిలో నిన్న రాత్రి బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భూమా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్న నాటి నుంచే ఈ భూ వివాదం కొనసాగుతోందని తెలుస్తోంది. మరోవైపు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి బాధితులు ప్రవీణ్ రావుతో పాటు అతడి సోదరులు నవీన్ రావు, సునీల్ రావు వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి.
నిన్న రాత్రి 7.30గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని తమ నివాసంలో ఉన్న ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. సినీఫక్కిలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లారు. ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను కూడా పట్టుకుపోయారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని గుర్తించారు. కిడ్నాప్‌కు గురైన ముగ్గరిని వికారాబాద్‌లో గుర్తించారు.