తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ నెల 2న జీలుగు కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన కేసును పోలీసులు ఛేధించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి అరెస్టు చేసిన అనంతరం మంగళవారం కాకినాడలో జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వివరాలను వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని చెప్పారు. జనవరిలో కనుమ రోజు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో రాంబాబుకు గొడవ జరిగింది. ఈ క్రమంలో రాంబాబును గ్రామ పెద్దలు హెచ్చరించారు.
ఈ గొడవ జరిగినప్పటి నుంచి ఆ మహిళ రాంబాబుకి దూరంగా ఉంటోంది. దీంతో అసహనానికి లోనైన రాంబాబు.. ఆమె భర్త అడ్డుతొలగించుకోవాలని ఓ పథకం పన్నాడు. పథకంలో భాగంగా.. ఈ నెల 1న రాత్రి జీలుగు చెట్టు కల్లు ముంతలో కలుపు మొక్కలను నాశనం చేసే గడ్డి మందును కలిపాడు. కాగా.. ఎప్పుడూ చెట్టు మించి కల్లు దింపాక.. ఆ మహిళ భర్తే తాగేవాడని.. ఆ తరువాతే మిగిలిన వారికి పంచేవాడు. దీన్ని అదునుగా చేసుకునే మహిళ భర్తను అడ్డుతొలగించుకోవాలని రాంబాబు బావించాడు. అయితే.. అనూహ్యంగా మహిళ భర్తతో పాటు మరో నలుగురు ఒకేసారి కల్లుతాగారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. కాగా.. నేరం ఎక్కడైనా జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేయకుండా పోలీసులకు సహకరించాలని ఎస్పీ తెలిపారు.