ఏపీలో దారుణం.. భార్య, అత్తను కత్తితో నరికి చంపిన కిరాతకుడు!
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో సోమవారం అర్ధరాత్రి రక్తం ఏరై పారింది.
By - అంజి |
ఏపీలో దారుణం.. భార్య, అత్తను కత్తితో నరికి చంపిన కిరాతకుడు!
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో సోమవారం అర్ధరాత్రి రక్తం ఏరై పారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై పెంచుకున్న అనుమానం, ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. నిందితుడు చోడదాసి పండు (అలియాస్ సీతారామరాజు), లత అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరి సంసారం కొన్నాళ్లు సాఫీగానే సాగినా, గత కొంతకాలంగా సీతారామరాజు మనసులో అనుమానం బీజం పడింది. దీనికి తోడు అతను మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భార్య లత, అత్త గుమ్మడి లక్ష్మి అడ్డు చెబుతున్నారని అతను కక్ష పెంచుకున్నాడు.
భర్తతో గొడవల కారణంగా లత తన తల్లిగారైన లక్ష్మి ఇంట్లోనే ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో అత్తగారింటికి చేరుకున్న సీతారామరాజు, నిద్రపోతున్న భార్య, అత్తలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సీతారామరాజుకు నేర చరిత్ర ఉంది. గతంలో కూడా ఒక హత్య కేసులో నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. భార్యపై ఉన్న అనుమానమే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఈ జంట హత్యలతో బొబ్బిలంక గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.