Hyderabad: మైనర్ బాలికపై 6 నెలల పాటు అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం కేసులో...
By - అంజి |
Hyderabad: మైనర్ బాలికపై 6 నెలల పాటు అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. నిందితుడు షేక్ నసీర్ అలియాస్ అహ్మద్ (35)ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, అతనికి భారీ జరిమానాతో పాటు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన అహ్మద్, దుండిగల్‌లో నివాసం ఉంటున్న సమయంలో 2021 అక్టోబర్ 29న ఒక మైనర్ బాలికను బెదిరించి కిడ్నాప్ చేశాడు.
బాలిక కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బాలికను ముంబైకి తీసుకెళ్లి, అక్కడ ఒక గదిలో సుమారు ఆరు నెలల పాటు నిర్బంధించాడు. ఆ సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ కేసులో పోక్సో (POCSO) చట్టంలోని కఠిన సెక్షన్లను చేర్చారు. ఈ క్రమంలోనే మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి వివిధ శిక్షలను ఖరారు చేసింది.
పోక్సో చట్టం సెక్షన్ 5(l) r/w 6: 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 5,000 జరిమానా, కిడ్నాప్ (IPC 363): 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 2,000 జరిమానా, అక్రమ నిర్బంధం (IPC 344): 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 1,000 జరిమానా, బెదిరింపులు (IPC 506): 1 సంవత్సరం శిక్ష మరియు రూ. 500 జరిమానా. వీటితో పాటు బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) ముత్యం రెడ్డి మాట్లాడుతూ.. పోక్సో కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, వేగంగా చార్జ్‌షీట్ దాఖలు చేయడం వల్లే నిందితుడికి కఠిన శిక్ష పడిందని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో సైబరాబాద్ పోలీసులు రాజీపడబోరని ఆయన స్పష్టం చేశారు.