ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ భర్త.. మద్యానికి బానిసై కిరాతకుడిగా మారాడు. మద్యం మత్తులో రోకలి బండతో దాడి చేయగా భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పులిగోనిపల్లితండాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణావత్ రాందాస్‌నాయక్, కవిత(28) 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతంలో కాటన్ మిల్లులో పనిచేసిన రాందాస్, ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు. భార్య కవిత కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. సోమవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడిన రాందాస్, తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య కవిత, కుమార్తె ప్రణీత(9), కుమారుడు హర్షవర్ధన్(7)లపై రోకలి బండతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో కవిత, హర్షవర్ధన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రణీతను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాందాస్‌నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే ఇతనిపై వేధింపుల కేసు ఉండటం గమనార్హం. తన తండ్రిని ఉరితీయాలంటూ రెండో కుమార్తె పావని చేసిన రోదన అక్కడున్న వారిని కలిచివేసింది.