నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి 2 గంటల వరకు విధులు నిర్వర్తించిన ఓ వైద్యురాలు తెల్లవారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గైనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. నిన్న రాత్రి రెండు గంటల వరకు డ్యూటీలోనే ఉంది. అనంతరం విశ్రాంతి గదిలోకి వెళ్లి పడుకొంది. ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. సిబ్బంది సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
శ్వేత చాలా యాక్డివ్ అని, ఆమె మృతి షాక్‌కు గురిచేసిందని ఆస్పత్రి సూపరిండెంట్ డా.ప్రతిమ అన్నారు. రాత్రి స్నేహితులతో కలిసి భోజనం చేసిందని, డ్యూటీ అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లి అక్కడ కుప్పకూలిపోయిందని తెలిపారు. శ్వేతకు రెండు సార్లు కొవిడ్ వచ్చిందని.. కొవిడ్ రిలేటెడ్ హార్ట్ స్ట్రోక్‌గా అనుమానిస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు కరీంనగర్ నుంచి నిజామాబాద్ బయలుదేరారు.
కాగా.. పని ఒత్తడి కారణంగా, మరే ఇతర కారణాల వల్ల శ్వేత మృతి చెందిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.