స్పై కెమెరాతో 3,000 ప్రైవేట్ క్షణాల వీడియోల రికార్డింగ్.. తోటి వైద్యురాలిపై డాక్టర్ బ్లాక్‌మెయిల్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక వైద్యుడు తన వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By - అంజి |
స్పై కెమెరాతో 3,000 ప్రైవేట్ క్షణాల వీడియోల రికార్డింగ్.. తోటి వైద్యురాలిపై డాక్టర్ బ్లాక్‌మెయిల్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక వైద్యుడు తన వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన సహోద్యోగిపై ఉన్న ఏకపక్ష ప్రేమతో, ఆమె ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న డాక్టర్ కమల్ నందాను పోలీసులు బుక్ చేశారు. సాధు వాసాని రోడ్డులోని ఒక క్లినిక్‌లో డెలివరీ రూమ్‌లోని బల్బ్ హోల్డర్‌లో ఇతడు రహస్యంగా స్పై కెమెరాను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. లైట్ స్విచ్ ఆన్ చేసిన ప్రతిసారీ ఆ కెమెరా దృశ్యాలను రికార్డ్ చేసి మెమరీ కార్డ్‌లో నిక్షిప్తం చేసేలా ఏర్పాటు చేశాడు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి నుంచి ఏకంగా 3,000కు పైగా వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 2023 నుండి ఈ నిఘా కొనసాగుతున్నట్లు సమాచారం. నిందితుడు ఎప్పటికప్పుడు మెమరీ కార్డ్‌లను మారుస్తూ డేటాను సేకరించేవాడు. బాధితురాలైన మహిళా డాక్టర్ మరొక సహోద్యోగితో ఉన్న ప్రైవేట్ వీడియోలను తీసి, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే రూ. 25 లక్షల రూపాయల డిమాండ్ చేయగా, ఇప్పటివరకు బాధితుల నుండి రూ. 50 వేలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కుట్రలో డాక్టర్ కమల్ నందాతో పాటు మరికొందరు మధ్యవర్తులు, జర్నలిస్టుల అవతారమెత్తిన వ్యక్తులు కూడా ఉన్నట్లు తేలింది. వీరందరూ కలిసి బాధితులను మానసికంగా వేధిస్తూ డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. ఈ కేసులో మొత్తం 12 మందిపై ఎక్స్టార్షన్ (వసూళ్లు), నేరపూరిత కుట్ర, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తట్టుకోలేక, పగతోనే నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్రస్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రొఫెషనల్ రంగాల్లో, ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఇలాంటి నిఘా పరికరాల దుర్వినియోగం జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైద్య సంస్థలు తమ అంతర్గత భద్రతను పటిష్టం చేసుకోవాలని అధికారులు సూచించారు.