దారుణం.. నల్లగా ఉన్నాడని.. భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా గొండిఖేడ గ్రామంలో జరిగిన ఒక హత్య ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. తొలుత దోపిడీ దొంగల పనిగా భావించిన ఈ ఘటన...

By -  అంజి
Published on : 10 April 2026 1:30 PM IST

Dhar District Murder Case, Madhya Pradesh Crime News, Staged Robbery Conspiracy, Contract Killing for Extramarital Affair, Superintendent of Police Mayank Awasthi, Gondikheda Village Murder, Spousal Homicide Investigation

దారుణం.. నల్లగా ఉన్నాడని.. భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా గొండిఖేడ గ్రామంలో జరిగిన ఒక హత్య ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. తొలుత దోపిడీ దొంగల పనిగా భావించిన ఈ ఘటన, పోలీసుల విచారణలో భార్యే స్వయంగా ప్రియుడితో కలిసి చేయించిన కిరాతక హత్యగా తేలింది. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గొండిఖేడ గ్రామానికి చెందిన దేవకృష్ణ అనే వ్యక్తి తన ఇంట్లోనే శవమై కనిపించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి, తనపై దాడి చేసి, భర్తను చంపేసి సామాన్లన్నీ దోచుకెళ్లారని అతని భార్య ప్రియంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఇల్లంతా చిందరవందరగా పడి ఉండటం, ప్రియంక ఏడుస్తూ కనిపించడంతో ఇది దోపిడీ దొంగల పని అని ప్రాథమికంగా భావించారు.

అయితే, సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు అది పక్కాగా సృష్టించిన క్రైమ్ సీన్ అని అనుమానం వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులను విచారించగా, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తేలింది. ముఖ్యంగా ప్రియంక తన భర్తను అతని రంగు విషయంలో వేధించేదని, "నువ్వు నల్లగా ఉన్నావు.. నాకు మంచి అందగాడు కావాలి" అంటూ అవమానించేదని వారు పోలీసులకు తెలిపారు. విడాకులు ఇవ్వాలని కూడా ఆమె ఒత్తిడి చేసేది. ఈ క్రమంలోనే ప్రియంకకు 2020 నుండి కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రియంక, ఆమె ప్రియుడు కమలేష్ పథకం వేశారు. దీనికోసం సురేంద్ర అనే వ్యక్తికి రూ. 1 లక్ష సుపారీ (కాంట్రాక్ట్) ఇచ్చారు.

పథకం ప్రకారం, దేవకృష్ణ గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితులు మారణాయుధంతో దాడి చేసి హతమార్చారు. అనంతరం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఇంట్లోని వస్తువులను పడేసి, ప్రియంకను కట్టేసి దోపిడీ నాటకానికి తెరలేపారు. కేసు నమోదైన 36 గంటల్లోనే ధార్ జిల్లా ఎస్పీ మయాంక్ అవస్థీ నేతృత్వంలోని బృందం అసలు నిజాన్ని వెలికితీసింది. సాంకేతిక ఆధారాలు, విచారణలో ప్రియంక చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో ఆమె అసలు విషయాన్ని అంగీకరించింది. ప్రస్తుతం పోలీసులు ప్రియంక మరియు ఆమె ప్రియుడు కమలేష్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న సురేంద్ర కోసం గాలిస్తున్నారు.

Next Story