కేరళలోని కోజీకోడ్‌లో దీపక్ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సులో దీపక్ తనను అసభ్యంగా తాకడంటూ శుక్రవారం ఓ యువతి సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. రద్దీగా ఉన్న బస్సులో దీపక్ తనను లైంగికంగా వేధించాడని, అతని మోచేయి తన ఛాతీకి తగిలించాడని, రుజువుగా ఇదిగో అంటూ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను అప్‌లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. అది వైరల్ కావడంతో అంతా దాని గురించే మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ క్లిప్ వైరల్ అయిన తర్వాత, దీపక్ తన నివాసంలో చనిపోయి కనిపించాడు.
సదరు యువతి.. తాను చేయని తప్పుకు తనపై నింద వేసిందంటూ దీపక్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని బంధువులు అంటున్నారు. దీపక్ అలాంటి వాడు కాదని, ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. జనసమూహం కారణంగా అనుకోకుండా చేయి తగిలిందని, అతను తీవ్ర చర్య తీసుకునే ముందు 'అన్ని ఆరోపణలతో చాలా బాధపడ్డాడని' కుటుంబం పేర్కొంది.
ఈ ఘటనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి, లైంగిక వేధింపుల వాదనల యొక్క ప్రామాణికత, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను దర్యాప్తు చేస్తున్నారు.