హైదరాబాద్‌లో దారుణం, మందలించిన తండ్రిని చంపిన కూతురు
ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. మందలించాడని అతిదారుణంగా తండ్రినే హత్య చేసింది.
By Srikanth Gundamalla Published on 30 July 2023 12:33 PM ISTహైదరాబాద్‌లో దారుణం, మందలించిన తండ్రిని చంపిన కూతురు
తల్లిదండ్రులు పిల్లల బాగు కోసమే ఆలోచిస్తారు. ఆ క్రమంలోనే కొన్ని పనులు చేయొద్దంటూ హద్దులు పెడతారు. కానీ.. అలా హద్దులు పెట్టడంపై పిల్లలు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. తమకు నచ్చిందే చేస్తామని.. తమ లైఫ్ తమ ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు పెద్దలు చిన్నమాట అన్నారని ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. ఇంకొన్నిసార్లు అయితే ఇళ్ల నుంచి పారిపోయారు. అయితే.. తాజాగా ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. మందలించాడని అతిదారుణంగా తండ్రినే హత్య చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.
తల్లిదండ్రులు మందలించారని, కోప్పడ్డారని, ఫోన్ పోయిందని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. ఇలా ఇతరత్రా కారణాలతో యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. ఓ యువతి మాత్రం దారుణంగా ప్రవర్తించి తండ్రినే హత్య చేసింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో జగదీశ్వర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. అతనికి ఒక కూతురు ఉంది. పేరు నిఖిత. అయితే.. యువతి నిఖిత అఫ్జల్‌గంజ్‌లోని ఓ దుకాణంలో పని చేస్తోంది. యువతి దుకాణంలో పని అయ్యాక వెంటనే ఇంటికి రాకుండా రోజూ ఆలస్యంగానే వెళ్తుంది. దాంతో.. తండ్రి కూతురిని మందలించాడు. ఇలా చేయడం సరికాదని.. వెంటనే ఇంటికి రావాలని చెప్పాడు. దాంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైంది సదురు యువతి. తండ్రితో వాగ్వాదానికి దిగింది.
తండ్రీకూతురు మధ్య మాటామాటా పెరిగి.. నిఖిత ఊహించని విధంగా విచక్షణ కోల్పోయింది. కన్నతండ్రిపైనే దాడి చేసింది. కింద పడేసి గాజు పెంకుతో తండ్రి గొంతు కోసేసింది. దాంతో.. తండ్రి జగదీశ్వర్ గట్టిగా అరిచాడు. అతని అరుపులతో కుటుంబ సభ్యులు ఇంట్లోకి చేరుకున్నారు. అప్పటికే జగదీశ్వర్ గొంతు తెగిపోయి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా.. జగదీశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు నిఖితను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.