కప్ప పై కోపం.. చంపి సాంబారు వండాడు.. తిని కూతురు మృతి
Daughter Died after she eats toad currry which made by her father.ఇంట్లోకి కప్ప వచ్చిందని ఆగ్రహించిన ఓ వ్యక్తి
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2023 3:02 AM GMTఇంట్లోకి కప్ప వచ్చిందని ఆగ్రహించిన ఓ వ్యక్తి దాన్ని చంపి కూర వండాడు. అది తిన్న కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురి అయ్యారు. చికిత్స పొందుతూ ఆరేళ్ల చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
మునా ముండా (40) అనే వ్యక్తి కియోంజర్ జిల్లా జోడా బ్లాక్ ప్రాంతంలోని గురుడా గ్రామంలో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతడి ఇంట్లోకి తరచుగా కప్పలు వస్తుండడంతో తీవ్ర అసహనానికి గురి అయ్యేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న ఓ కప్ప అతడి ఇంట్లోకి రావడంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది.
వెంటనే ఆ కప్పను చంపి దానితో సాంబారు చేశారు. దీన్ని కుటుంబ సభ్యులు అంతా తిన్నారు. కొద్ది సమయం తరువాత వారంతా అస్వస్థతకు గురి అయ్యారు. వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన చుట్టు పక్కల వారు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరేళ్ల సుమిత్రా ముండా మరణించింది. ఆమె సోదరి నాలుగేళ్ల ముని పరిస్థితి విషమంగా ఉంది.
అయితే.. వారి తండ్రి మునా ముండా మాత్రం కప్ప విషప్రభావం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతిని అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వీఎస్‌ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీబ్ మిశ్రా మాట్లాడుతూ.. కప్పల శరీరంలోని పరోటిడ్ గ్రంథి ఉంటుందని చెప్పారు. ఇది వాటిని వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి విషాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. కప్పను తినే వారిపై ఇది ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఇంకా కొన్ని కప్పల చర్మం విషపూరితంగా ఉంటుందని తెలిపారు.