తల్లీ, కుమారుడిని హత్య చేసి.. 16కిలోల బంగారం చోరీ.. 4 గంటల్లో
Dacoits kill jewelry owners wife son steal 16 kg gold.చెన్నైలో దొంగలు భీభత్సం సృష్టించారు. ఓ నగల వ్యాపారి ఇంట్లో తల్లీ, కుమారుడిని హత్య చేసి.. 16కిలోల బంగారం చోరీ.
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2021 10:30 AM IST
చెన్నైలో దొంగలు భీభత్సం సృష్టించారు. ఓ నగల వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు.. అడ్డొచ్చిన తల్లీ, కుమారుడిని హత్య చేసి 16 కేజీల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు గంటల్లోనే కేసును చేదించారు. పోలీస్ కాల్పుల్లో ఓ నిందితుడు మృతి చెందగా.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మైలాడుతురై జిల్లా శీర్గాలి రైల్వేస్టేషన్ రోడ్డులో నగల వ్యాపారి ధనరాజ్ (50), ఆయన భార్య ఆశ(48), కుమారుడు అఖిల్(25), కోడలు నిఖిల(24) కలిసి నివాసం ఉంటున్నారు.
బుధవారం ఉదయం 6.30 నిమిషాలకు దుండగులు ఆయన ఇంటి తలుపు తట్టారు. తలుపు తీయగానే.. వెంటనే ఆయనపై దాడి చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఆశ, అఖిల్, నిఖిలపై కత్తులతో దాడి చేశారు. అనంతరం బీరువాలో ఉంచిన 16 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు హార్డ్ డిస్క్‌ను తీసుకుని బయట పార్క్ చేసిన ధనరాజ్ కారులోనే పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో సంఘనాస్థలంలో ఆశ, అఖిల్‌లు ప్రాణాలు కోల్పోగా.. ధనరాజ్, నిఖిల తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ధనరాజ్ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా వారిని వెంబడించారు. ఎరుక్కూరు పొలాల వద్ద ముగ్గురు దుండగులు కారును అక్కడ వదిలివేసి పంటపొలాల గుండా మీదుగా వెళ్లారు. భుజాన సంచి వేసుకున్ని అనుమానాస్పదంగా ఉత్తరాది యువకులు తిరుగుతున్నట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులపై దాడి చేశారు. పోలీసుల కాల్పుల్లో మణిపాల్ మృతి చెందాడు. మనీష్, రమేష్ పటేల్ అనే మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ కాల్పుల్లో చనిపోయిన మణిపాల్ గతంలో ధనరాజ్ వద్ద పనిచేసినట్లుగా తెలుస్తోంది. ఓ తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో.. అతడిని ధనరాజ్ పనిలోంచి తొలగించాడు. దీంతో మిత్రులతో కలిసి అతడు ఈ దోపిడికి పాల్పడినట్లు తెలుస్తోంది.