Hyderabad: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొబెషనరీ ఐపీఎస్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 11:40 AM ISTHyderabad: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొబెషనరీ ఐపీఎస్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్నారు. రకరకాలుగా అమాయకులను వలలో వేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వీరి వలలో ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ చిక్కుకున్నారు. నేషనల్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ కు.. సైబర్ క్రైమ్ ముఠా వీడియో కాల్ చేసింది.
ఓ సైబర్ యువతి నగ్న వీడియో కాల్ చేసి యువకులను ఆకర్షిస్తోంది. ఆ తర్వాత అవే వీడియోలను అడ్డుకుపెట్టుకుని ఒక ఆట ఆడిస్తున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకున్న ఎంతోమంది అమాయకమైన యువకులు గిలగిలా కొట్టుకుంటూ లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు.. చివరకు వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ ప్రొబెషనరీ ఐపీఎస్‌కు ఎదురైంది. అయితే.. ప్రొబెషనరీ ఐపీఎస్ వెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నేషనల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబెషనరీ ఐపీఎస్ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కాడు. ఒక రోజు ప్రొబెషనరీ ఐపీఎస్ యువకుడికి వీడియో కాల్ వచ్చింది. దాంతో.. ఆ కాల్‌ను లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి వీడియో కాల్‌లో యువతి నగ్నంగా కనిపించింది. దాంతో.. విషయం అర్థం కాగానే అప్రమత్తమైన ప్రొబెషనరీ ఐపీఎస్ వెంటనే ఆ వీడియో కాల్‌ను కట్ చేశాడు. కానీ అప్పటికే ఆ యువతి వీడియో కాల్ రికార్డు చేసింది. ఆ వీడియోను తిరిగి ప్రొబెషనరీ ఐపీఎస్‌కు పంపించింది. డబ్బులు పంపాలని లేదంటే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ కాల్స్ చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే.. ఆ బెదిరింపు కాల్స్ రోజూ రావడం.. మితిమీరి మాట్లాడటంతో ప్రొబెషనరీ ఐపీఎస్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియని నెంబర్ నుండి వీడియో కాల్స్ కానీ..ఫోన్ కాల్స్ గానీ.. ఎటువంటి మెసేజ్లు కానీ.. వస్తే వాటిని క్లిక్ చేయకూడదంటూ పోలీసులు సూచిస్తున్నారు.