అమ్మాయి అనుకుని మాట్లాడాడు..రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు..!

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  16 July 2023 11:29 AM IST
Cyber Crime, Rs 10 Lakh, Hyderabad,

అమ్మాయి అనుకుని మాట్లాడాడు..రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు..!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులకు గాలం వేసి వారిని బుట్టలో చిక్కుకునేటట్లు చేస్తున్నారు. చదువుకున్న వారే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న నేరాల గురించి పోలీసులు ఎప్పటికప్పటికీ జనాలను హెచ్చరిస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌, ఇలా సోషల్‌ మీడియాలో అపరిచితులైన వ్యక్తులతో చాటింగ్ చేయడం కానీ... వారు చెప్పే మాటలు కానీ... నమ్మి మోసపోయి డబ్బులు కోల్పోవద్దంటూ పోలీసులు ఎన్నో మార్లు జనాలకు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా జనాలు పోలీసుల మాటలను విడిచెవిన పెట్టి సైబర్ నేరగాళ్లు వలలో చిక్కుకొని లక్షల్లో డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగు చూసింది.

హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు కోల్పోయాడు. ఒక అమ్మాయి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్‌ వచ్చింది. డీపీలో అమ్మాయి అందంగా ఉన్న ఫొటో ఉండటంతో సదురు వ్యక్తి రిక్వెస్ట్‌ను స్వీకరించాడు. ఆ తర్వాత మెసేజ్‌ చేశాడు. రోజురోజుకు ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. పూర్తిగా ఆ మాయలేడి మాయజాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మునిగిపోయాడు. అప్పుడే ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని.. ఆస్పత్రిలో ఉన్నారని చెప్పింది. వెంటనే డబ్బులు కావాలంటూ నమ్మించింది. పాపం ఆ మాటలు నమ్మిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అలా విడతల వారీగా మొత్తం రూ.10 లక్షల రూపాయలు వసూలు చేశారు. రెండుమూడు రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ స్విచ్ఛాఫ్‌ వచ్చింది.

అప్పుడు అసలు విషయం బయటపడింది. ఒక అందమైన అమ్మాయి ఫొటో పెట్టి అమ్మాయిలా మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్లు మోసం చేసినట్లు తేలింది. రూ.10 లక్షలు కాజేశాక ప్లాన్‌ భాగంగానే సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆ తర్వాత బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే.. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story