పెట్టుబడి పేరుతో రూ.400 కోట్ల మోసాలు, నిందితుడు అరెస్ట్

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొందరు అయితే లక్షల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2023 2:59 PM IST
Cyber crime, investment fraud, Man Arrested, Hyderabad,

పెట్టుబడి పేరుతో రూ.400 కోట్ల మోసాలు, నిందితుడు అరెస్ట్

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొందరు అయితే లక్షల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌లలో పెట్టుబడి పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఓ వ్యక్తి. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు అతడి మోసాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకమైన జనాలను మోసం చేస్తున్నారు. ఎంతోమంది సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. పోలీసులు సైబర్ నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ని హెచ్చరికలు చేసిన కూడా కొంతమంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ఓ సైబర్ నేరగాడు సోషల్ మీడియాలో లింకులతో మోసాలకు పాల్పడ్డాడు. ఆ సైబర్ నేరగాడి చేతిలో హైదరాబాద్ కు చెందిన ఓ బాధితుడు చిక్కి ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసపోయాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వేట కొనసాగించారు. దాంతో డొంక లాగితే తీగ మొత్తం కదలి వచ్చినట్లుగా.. పోలీసులు కూపీలాగడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది.

సైబర్ నేరగాడు రోనాక్ భరత్ కాకాడే దేశవ్యాప్తంగా ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో అమాయకమైన జనాలకు గాలం వేశాడు. వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. దేశవ్యాప్తంగా ఏజెంట్లను, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని అనేక సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. రాష్ట్రం నుండి రోజుకు లక్షల్లో డబ్బులు కాజేశాడు. అంతే కాదండోయ్ ఈ నిందితుడు దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో జనాల వద్ద నుండి వసూలు చేసిన కోట్ల రూపాయలను దేశం దాటించాడు కూడా. దేశంలో ఉన్న అనేకమంది అకౌంట్స్ వివరాలు సేకరించి, వందల సంఖ్యలో ఏజెంట్ల ద్వారా కొంతమంది వ్యక్తుల పేర్లపై నకిలీ అకౌంట్లు క్రియేట్ చేశాడు. ఆ విధంగా క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్స్ కి సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశాడు. నకిలీ అకౌంట్లోకి బదిలీ చేసిన కోట్ల రూపాయలను బిట్ కాయిన్స్ రూపంలో విదేశాలకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

కాగా.. ఇప్పటికే నిందితుడు రోనాక్‌ భరత్‌ కాకాడే పై దేశవ్యాప్తంగా 50 కేసులు నమోదయ్యాయి. నిందితుడి అకౌంట్ వివరాల ద్వారా ఇప్పటివరకు 400 కోట్ల రూపాయలను చైనా, తైవాన్ దేశాలకు తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితుడు రోనాక్ భరత్ ముంబైలో ఉన్నట్లుగా సిసిఎస్ పోలీసులు గుర్తించారు. దాంతో.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వెళ్లి నిందితుడు భరత్‌ను అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకొచ్చారు.

Next Story