రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా సీఎస్ శాంతికుమారి పేరుతో చాటింగ్

సైబర్ నేరగాళ్ల దొపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. కామారెడ్డి జిల్లాలో సైబర్‌ నేరగాళ్ల కొత్త తరహా దొపిడీ వెలుగులోకి వచ్చింది.

By అంజి
Published on : 5 July 2023 11:19 AM IST

Cyber ​​cheaters, Kamareddy Collectorate, CS Shantha Kumari

రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా సీఎస్ శాంతికుమారి పేరుతో చాటింగ్

సైబర్ నేరగాళ్ల దొపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సైబర్‌ పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ఎవరికీ అంతు చిక్కకుండా కొత్త తరహాలో దొపిడీకి పాల్పడుతున్నారు. డబ్బుల కోసం సైబర్‌ నేరగాళ్లు రోజుకో రూట్‌ వెతుక్కుంటున్నారు. పేదవాడి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిని వదలకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులతో పేర్లతో చాటింగ్‌ చేసి మరీ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో సైబర్‌ నేరగాళ్ల కొత్త తరహా దొపిడీ వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి పేరుతో సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేయడంతో పాటు, వాట్సాప్‌ కాల్స్‌ వచ్చాయి. చాటింగ్‌లో తమ అవసరాన్ని తెలిపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారు. అయితే సైబర్‌ మోసాలపై అవగాహన ఉన్న ఉద్యోగులు ఆయా కాల్స్‌ని తిరస్కరిస్తుంటే.. అవగాహన లేని వారు మాత్రం వారి ఉచ్చులో చిక్కుకుపోతున్నారు.

సీఎం శాంతకుమారి పేరుతో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు వాట్సాప్‌ చాటింగ్‌ చేసి మొదట క్షేమసమాచారాలు అడిగి, ఆ తర్వాత ఎమర్జెనీ అని చెప్పి డబ్బులు పంపించాలంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. దీంతో కలెక్టరేట్‌లోని ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇలా గతంలో డిప్యూటీ తహశీల్దార్‌ స్థాయి అధికారి నుండి రూ.2 లక్షలు గుంజారు సైబర్‌ నేరగాళ్లు. 15 రోజుల కిందట కలెక్టరేట్‌లో పలువురు అధికారులకు ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఎంతో కొంత నగదు పంపాలని, లేదంటే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇది సైబర్‌ నేరగాళ్ల పనిగా భావించిన ఉన్నతాధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story