దారుణం.. ఐసీయూలో రోగిపై ఎలుక‌ల దాడి.. మృతి..!

Critical patient dies of rat bite in Mumbai hospital.ముంబైలో దారుణ‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 9:47 AM IST
దారుణం.. ఐసీయూలో రోగిపై ఎలుక‌ల దాడి.. మృతి..!

ముంబైలో దారుణ‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిపై ఎలుక‌లు దాడి చేశాయి. ఈఘ‌ట‌న‌లో బాధితుడి క‌న్నుకు గాయమైంది. అయితే.. పెద్ద‌గా ప్ర‌మాదం ఏమీ లేద‌ని డాక్ట‌ర్లు చెప్పిన.. 24 గంట‌ల్లోనే బాధితుడు ప్రాణాలు కోల్పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశమైంది. బాధిత కుటుంబ స‌భ్యులు, ఐసీయూలోని మిగ‌తా రోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఆస్ప‌త్రి ముందు ధ‌ర్నాకు దిగారు. ఆస్ప‌త్రిలో ఎలుక‌లు దూరి రోగిని చంప‌డం.. ఆస్ప‌త్రి యాజ‌మాన్య నిర్ల‌క్ష్యానికి అద్దం ప‌డుతుంద‌ని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌ను బీఎంసీ ప‌రిపాల‌నా విభాగం సీరియ‌స్‌గా తీసుకుంది. ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ముంబై మేయ‌ర్ కిశోరీ పెడ్నేక‌ర్ తెలిపారు.

అస‌లేం జరిగిందంటే..

కుర్లా, కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలుండటంతో ఐసీయూలో చేర్పించి వైద్యం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐసీయూలోకి వచ్చిన బంధువులు శ్రీనివాస్‌ కంటి నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు గమనించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు పరీక్షించారు.

రోగి నిద్రలో ఉండగా ఎలుకలు కన్ను కొరికినట్లు నిర్థార‌ణ‌కు వచ్చారు. అదృష్టవశాత్తు కన్నుకు ఎక్కువగా గాయం కాలేద‌ని.. పెద్ద‌గా ప్ర‌మాదం ఏమీ లేద‌ని ఆస్ప‌త్రి సిబ్బంది శ్రీనివాస్ బంధువుల‌కు తెలిపారు. ఈ విష‌యం తెలుసుకున్న కిశోరి పేడ్నేకర్‌ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. కాగా.. బాధితుడు 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే ప్రాణాలు కోల్పోయాడు.

ఇదిలాఉండగా.. నాలుగేళ్ల కిందట కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కాటేశాయి. ఆ తరువాత మార్చురిలో ఉన్న శవాలను గుర్తుపట్టలేనంతగా ఎలుకలు కొరిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ బీఎంసీ, ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు రాకపోకడంపై రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Next Story