అంబులెన్స్‌లో అక్ర‌మంగా ఆవుల త‌ర‌లింపు.. సిలిండ‌ర్ పేలి సజీవ దహనం

Cows moving in an ambulance were burned alive in Nizamabad District.నిజామాబాద్ జిల్లాలో ఆవుల స‌జీవ‌ద‌హ‌నం తీవ్ర క‌ల‌క‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2022 1:04 PM IST
అంబులెన్స్‌లో అక్ర‌మంగా ఆవుల త‌ర‌లింపు..  సిలిండ‌ర్ పేలి సజీవ దహనం

నిజామాబాద్ జిల్లాలో ఆవుల స‌జీవ‌ద‌హ‌నం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఓ టెంపోకు అంబులెన్స్ స్టిక్క‌ర్స్ అంటించి అందులో అక్ర‌మంగా ఆవుల‌ను త‌ర‌లిస్తున్న ముఠా గుట్టు బ‌య‌ట‌ప‌డింది. అయితే.. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ వాహ‌నానికి నిప్పు అంటుకోవ‌డంతో ఆవుల‌న్నీ స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యాయి.

ఓ ముఠా ఆవుల‌ను అక్ర‌మంగా నిర్మల్ నుంచి హైదరాబాద్‌కు అంబులెన్స్ వాహ‌నంలో త‌ర‌లిస్తుండ‌గా.. శ‌నివారం రాత్రి ఇంద‌ల్వాయి మండ‌లం మాక్లూర్ తండా వ‌ద్దకు రాగానే వాహ‌నంలోని సిలిండ‌ర్ పేలింది. దీంతో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. వెంట‌నే వాహ‌నాన్ని రోడ్డు ప‌క్క‌కు నిలిపివేసిన డ్రైవ‌ర్ అక్క‌డి నుంచి ప‌రారు అయ్యాడు. అటుగా వెలుతున్న వాహ‌న‌దారులు అంబులెన్స్‌కు మంట‌లు అంటుకున్న విష‌యాన్ని పోలీసులకు తెలియ‌జేశారు.

వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు మంట‌ల‌ను ఆర్పివేశారు. అనంత‌రం ఆ వాహ‌నం డోర్లు ఓపెన్ చేయ‌గా.. ఆవులు సజీవ‌ద‌హ‌న‌మై క‌నిపించాయి. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. ఆవులు స‌జీవ ద‌హ‌నమైన ఘ‌ట‌న జిల్లాలో తీవ్ర క‌ల‌కలం రేపుతోంది.

Next Story