వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ లేక వెంటిలేటర్ పనిచేయక ఓ రోగి ఊపిరి ఆగిపోయింది. మృతుడి భార్య తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన నూనె హరిగాంధీ(45) ఊపిరితిత్తులు దెబ్బతినగా ఫిబ్రవరి 24న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిని కరోనా వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 20 రోజులుగా అతనికి వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. శనివారం ఉదయం 10.30గంటల సమయంలో ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
కరెంటు లేకపోవడంతో అతడికి అమర్చిన వెంటిలేటర్ పనిచేయలేదు. సిబ్బందికి చెబితే.. ఏం కాదు అని అరగంటలో వచ్చేస్తుందని బదులు ఇచ్చినట్లు చెప్పింది. అరగంట దాటినప్పటికి కరెంట్ రాలేదు. ఆస్పత్రిలో ఉన్న జనరేటర్ కూడా పనిచేయలేదు. అంబూబ్యాగ్ ద్వారా కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హరిగాంధీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తన భర్త మరణానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి భార్య రజిత ఆరోపించింది. కరెంట్ సరఫరా ఉండదని పత్రికల్లో ప్రకటనలు వచ్చినా.. జనరేటర్ అందులోబాటులో ఉంచలేదని రోదిస్తూ చెప్పింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.నాగార్జునరెడ్డిని వివరణ కోరగా.. జనరేటర్‌లో సాంకేతిక సమస్య రావడం వల్ల పనిచేయలేదన్నారు. ఆస్పత్రిలో చేరినప్పుడే బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగానే.. ఈఘటన చోటు చేసుకోవడం విచారకరమని తెలిపారు.