సమాజంలో మానవత్వం పూర్తిగా మంటగలుస్తోంది. కరోనా సోకి చికిత్స పొందటానికి వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ మహిళ.. సెల్‌ఫోన్, డబ్బుల కోసం దారుణంగా హత్యచేసింది. ఈ ఘటన చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరువొట్టియూర్‌కు చెందిన 40 ఏళ్ల రతీదేవి చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద ఉద్యోగినిగా పని చేస్తోంది.
గత నెల 23(మే)న సునీత అనే మహిళ కరోనా సోకి ఆస్పత్రిలో చేరింది. సునీత దగ్గర ఉన్న నగదు చూసిన రతీదేవి వాటిని ఎలాగైనా కాజేయాలని పన్నాగం పన్నింది. పక్కా ప్రణాళికతో సునీతను ఆస్పత్రి చివరి అంతస్థుకు తీసుకువెళ్లి అతి కిరాతకంగా గొంతుకోసం హత్య చేసింది. అనంతరం మృతురాలి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మెరుగైన ఆరోగ్యంతో ఉన్న తన భార్య ఒక్కరోజులోనే చనిపోయిందని తెలిసిన సునీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి డబ్బు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.