ఆ దంపతులకు ఇద్దరు కూమారైలు. వారిద్దరిని చిన్నానాటి నుంచి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఇటీవల పెద్ద కుమారైకు వివాహాం చేయాలని ఓ మంచి సంబంధం చూశారు. అయితే.. కుమారై తీసుకున్న నిర్ణయంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనైయ్యారు. ఈ విషయం బంధువులకు తెలిస్తే తమ పరువు పోతుందని బావించి ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన పల్లకొండ నారాయణ(45), రాజేశ్వరీ(40) దంపతులు. వీరికి ఇద్దరు కుమారైలు. వీరు కొన్నాళ్ల క్రితం నుంచి కందిలో నివాసం ఉంటున్నారు. వృత్తి రీత్యా నారాయణ కానిస్టేబుల్. గతంలో సంగారెడ్డిలో పని చేసిన ఆయన ప్రస్తుతం జిన్నారంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల పెద్ద కుమారై కు పెళ్లి నిశ్చయమైంది.
అయితే.. ఈ వివాహం ఇష్టంలేని సదరు యువతి రెండు రోజుల క్రిందట మరో వ్యక్తితో వెళ్లి పోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆ దంపతులు తీవ్ర ఆవేదనకు లోనైయ్యారు. ఈ విషయం బంధువులకు తెలిస్తే తమ పరువు పోతుందని మదనపడ్డారు. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ దంపతులు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.