నీటిని తాగేటప్పుడు మనం తాగే నీరు సురక్షితమైన నీరో కాదో చూసుకోవాలి. మంచి నీటిని నిల్వ చేసిన పాత్రలో ఏవైనా పడ్డాయో లేదో గమనించుకోవాలి లేదంటే ప్రాణహాని కావొచ్చు. ఓ చిన్నారి ఇంటిలో ఉన్న మంచినీటి బిందెలో ఎలుక పడి మరణించింది. అయితే.. ఆ చిన్నారి ఆ విషయాన్ని గమనించలేదు. అలాగే ఆ నీటిని తాగి ప్రాణాలు కోల్పోయాడు.ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో ప్రభు దివ్య తేజ అనే ఆరేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం ఇంటిలోని బిందెలోని మంచినీటిని దివ్య తేజ తాగాడు. కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. ఏకదాటిగా వాంతులు అయ్యాయి. మంచి నీటిలో ఎలుక పడి చనిపోయి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తేజను జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడు ఇక లేడని తెలిసి ఆ చిన్నారి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం.