విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తమకున్న ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన దంపతులు...
By - అంజి |
విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తమకున్న ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన దంపతులు, ఆ పుట్టెడు దుఃఖాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ ఇంటి పెరట్లోని చెట్టుకు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. కృష్ణ పటేల్ , రమాబాయి పటేల్ (47) దంపతులకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మరణించాడు. నాటి నుండి ఆ దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఫిబ్రవరి 16న తమ ఇంట్లోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం నుంచి పటేల్ దంపతుల ఇంటి తలుపులు తీయకపోవడం, లోపలి నుండి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా, పెరట్లోని చెట్టుకు దంపతులిద్దరూ వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల దర్యాప్తులో దంపతులు రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్, అలాగే వారు తీసుకున్న ఒక వీడియో లభ్యమయ్యాయి.
ఆ వీడియోలో వారు ఒక విన్నపం చేశారు. తమ మరణానంతరం వచ్చే భీమా సొమ్మును తన అన్నయ్యకు అందజేయాలని కృష్ణ పటేల్ కోరారు. కుమారుడి అకాల మరణం కలిగించిన బాధను భరించలేకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కష్టకాలంలో ఆ దంపతులకు తగిన మానసిక మద్దతు అంది ఉంటే, ఇంతటి దారుణ నిర్ణయం తీసుకునేవారు కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.